మంగళవారం, నవంబర్ 28, 2017

మెంటల్ మదిలో...

సాధారణంగా ఒకటికన్నా ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తే మనందరం ఏది ఎన్నుకోవాలా అని అంతో ఇంతో కన్ఫూజ్ అవడం సహజం, మన అభిరుచి, అనుభవం, అవసరం ఇత్యాదులని బేరీజు వేసుకుని ఆలోచించి సరైన ఆప్షన్ ఎన్నుకుని ముందుకు సాగుతాం. ఐతే ఈ కన్ఫూజన్ మితిమీరిన మోతాదులో ఉన్న వ్యక్తే అరవింద్ కృష్ణ (శ్రీ విష్ణు). చిన్నతనం నుండీ కూడా ఆ రోజు ఏ డ్రస్ వేస్కోవాలో తల్లి డిసైడ్ చేసి ఇస్తే తప్ప రోజు మొదలవని అరవింద్ స్కూల్లో పరీక్షల్లో కూడా ఎస్సేటైప్ ఆన్సర్స్ పేజీలకు పేజీలకు రాసేసి మల్టిపుల్ ఛాయిస్ కొశ్ఛన్స్ కి మాత్రం తెల్లకాగితం ఇచ్చి వచ్చే రకం. ఎంతపెద్దైనా ఈ కన్ఫూజన్ అలా కొనసాగుతూనే ఉంటుంది. 

ఉన్న ఈ లక్షణం చాలదన్నట్లు చిన్నప్పుడే జరిగిన ఓ సంఘటన వల్ల అమ్మాయిలతో మాట్లాడాలంటే కూడా చచ్చేంత భయం, పక్కింటి అమ్మాయైనా క్లాస్మేట్ అయినా కనిపిస్తే తప్పించుకు తిరగడమే తప్ప మాటకలిపే అలవాటుండదు. అలాంటి మన హీరోగారికి పెళ్ళీడు వచ్చింది, ఇంకేముంది తండ్రి (శివాజిరాజా) గారి గుండెల మీద కుంపటే అయ్యాడు, ఆయన రెండున్నరేళ్ళ పాటు చేసిన విఫలయత్నాలతో విసిగిపోయున్న తరుణంలో ఓ స్నేహితుడి ద్వారా తెలిసిన ఓ ఇంటికి పెళ్ళి చూపులకి తీస్కెళతాడు కొడుకుని. 

ఆ అమ్మాయే "నాకేం కావాలో నాకు తెలియదా" అంటూ తన జీవితం మీద మంచి క్లారిటీ ఉన్న స్వేచ్ఛ(నివేదా పేతురాజ్). అనూహ్యంగా తనకి అరవింద్ నచ్చడం ఇద్దరి స్నేహం ముందుకు వెళ్ళడంతో ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరుగుతాయి.. అన్నీ బావున్నాయనుకునే తరుణంలో కొన్ని పరిస్థితుల వల్ల ఎంగేజ్మెంట్ వాయిదా వేస్కోవలసి వస్తుంది. ఈ గ్యాప్ లో స్వేచ్ఛకు దూరంగా వేరే ఊరు వెళ్ళిన అరవింద్ కు రేణు (అమృత) పరిచయం అవుతుంది. స్వేచ్ఛ పరిచయం అవక ముందు తనకెలాంటి అమ్మాయి కావాలని తను కోరుకున్నాడో అలాంటి అమ్మాయి రేణు.

అసలే కన్ఫూజన్ మాస్టర్ అయిన మన హీరో గారికి ఇపుడు ఎవరితో జీవితాన్ని పంచుకోవాలనె కన్ఫూజన్ మొదలైపోతుంది. దానిని ఎలా అధిగమించి జీవితాన్ని సుఖాంతం చేసుకున్నాడో తెలియాలంటే "మెంటల్ మదిలో" సినిమా చూడాలి. పెళ్ళిచూపులు చిత్రాన్ని నిర్మించిన అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి తన రెండో చిత్రంలోనూ తన అభిరుచిని నిరూపించుకున్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ సెకండాఫ్ లో బోంబే ఎపిసోడ్ దగ్గర కాస్త తడబడినా కానీ మంచి క్లైమాక్స్ తో చక్కని కథనాన్ని వ్రాసుకున్నారు. సినిమా పూర్తయేసరికి ఒక హాయైన సినిమా చూసిన అనుభూతిని కలిగిస్తుంది. పాటలు, నేపధ్యసంగీతం కూడా సినిమా మూడ్ కి తగినట్లుగా ఆహ్లాదకరంగా ఉన్నాయ్. 

శ్రీవిష్ణు, నివేధా చాలా సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. హీరో తండ్రి పాత్రలో శివాజీరాజా అండ్ హీరోయిన్ తల్లి పాత్రలో అనితా చౌదరి పాత్రలు గుర్తుండిపోతాయ్. ఇద్దరి క్యారెక్టరైజేషన్ చాలా సహజంగా ఉంది. వీళ్ళ పాత్రలకూ సినిమాలో చూపించిన సింపుల్ పెళ్ళి చూపులు సీన్ కి చాలా మంది కనెక్ట్ అవుతారు.  కొన్ని సింబాలిక్ షాట్స్, ప్రిక్లైమాక్స్ లో తండ్రి హీరోకి ఇచ్చే సలహా అలాగే హీరోయిన్ కి తన తల్లి "మాకు నువ్వు ముఖ్యం పరువు, బంధువులు అన్నీ అందరూ నీ తర్వాతే" అని చెప్పే మాటలు ఆకట్టుకుంటాయి. వైవిధ్యమైన సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరు మిస్ అవకుండా చూడవలసిన సినిమా "మెంటల్ మదిలో". ఇలాంటి మంచి సినిమాలని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు.  

2 కామెంట్‌లు:

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.