శుక్రవారం, సెప్టెంబర్ 04, 2009

ఇది నిజమేనా ??

కోట్లాది అభిమానుల గుండెల్లో గత ఇరవై నాలుగు గంటలు గా పదే పదే మొలకెత్తు తున్న ప్రశ్న ఇది. చెరగని చిరునవ్వుకీ, నిండైన తెలుగు తనానికీ, ఎదురు లేని ఆత్మ విశ్వాసానికీ, తిరుగులేని మొండిధైర్యానికీ కలిపి రూపం ఇచ్చినట్లుగా ఉండే మన YSR (డాక్టర్ ఎడుగూరి సంధింటి రాజశేఖరరెడ్డి) గారు ఇక లేరు అనీ ఇకపై కేవలం వీడియో లు ఫోటోల లోనే కనపడతారనీ.. ప్రజల గుండెల్లో ఏర్పరచుకున్న చెరగని స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు అని తెలిసిన ప్రతి ఒక్కరూ అయ్యో అనుకోక మానరు. కనపడుట లేదు అని ప్రకటించిన దాదాపు ఇరవై నాలుగు గంటల తర్వాత chopper was found burnt అని వార్తలు వచ్చినా... "ఏమో ఒక వేళ ముందే దూకేసి ఉండచ్చేమో.." అనే అత్యాశ తో ఓ వైపు, "లేదు అంతా అయిపోయింది ఇక అధికారిక ప్రకటనే మిగులుందేమో.." అనే అనుమానం ఒక వైపు మెలిపెడుతుండగా ఎదురు చూసిన అభిమానులను నిరాశ పరుస్తూ పిడుగు లాటి వార్త బయల్పడింది. పగవాడికి కూడా వద్దు ఇలాటి మరణం అనుకునే విధం గా ఆయన పొందిన హఠాన్మరణం తీవ్రం గా కలచి వేసింది, i hate helicopters అనుకునేలా చేసింది.

నాకు రాజకీయ పరిఙ్ఞానం చాలా తక్కువ. ఎవరో బాగా పేరు పొందిన నాయకుల గురించి తప్ప తెలియదు. ఇప్పటి వరకూ నా జీవితం లో కరచాలనం చేసిన రాజకీయనాయకులు ఇద్దరే ఇద్దరు ప్రత్యక్షంగా చూసిన వారు కూడా అంతే. ఒకరు నేను ఇంటర్మీడియేట్ చదివే కాలేజీ యానివర్సరీ ఫంక్షన్ కి వచ్చిన ఇప్పటి బీజేపీ నేత వెంకయ్య నాయుడు గారు. ఇంకొకరు నేను ఇంజనీరింగ్ చదివే సమయం లో వైజాగ్ తాజ్ హోటల్ కి మరి కొందరు విధ్యార్ది నాయకులతో కలిసి వెళ్ళి కలిసిన అప్పటి యువజన నాయకుడు వైయస్సార్. ఆయనని నమ్మిన వారిని ఖచ్చితంగా ఆదుకుంటారు, సాయం చేసిన వారిని పేరు పేరునా గుర్తు పెట్టుకుంటారు. చాలా మంచి నాయకుడు. ఖచ్చితంగా కాబోయే ముఖ్య మంత్రి అని తోటి విధ్యార్దులు అందరూ అంటున్నా ఆ అభిమానులు అన్న తర్వాత ఆమాత్రం పొగడరా అని అనుకుంటూనే వెళ్ళాను. ఆయన రాత్రి పదీ పదకొండు గంటల మధ్య అయినా ఏమాత్రం విసుగు కనపడనివ్వకుండా చెరగని చిరునవ్వుతో పలకరించి ఆప్యాయంగా మాట్లాడిన వైనం నన్ను సంభ్రమానికి గురిచేసింది నాయకుడు ఇలానె ఉంటాడేమో అనిపించింది. ఆ తర్వాత కొన్నేళ్ళకి ముఖ్య ప్రతిపక్ష నేతగా ఎదిగి కాంగ్రెస్ పని అయిపోయింది రా అని అన్న వాళ్ళు ఆశ్చర్య పడేలా ఒక్క చేత్తో పార్టీ నీ గెలిపించి తిరుగు లేని నాయకుడై నిలిచాడు.

ఎందరు ఏమన్నా మూర్తీభవించిన తెలుగుతనం లా తీరైన పంచకట్టు తో చెరగని చిరునవ్వు తో హుందాగా నడచి వచ్చే ఆ నాయకుడు ఇక పై కనపడరు అంటే జీర్ణించు కోడం కష్టంగానే ఉంది. ప్రతిపక్షం చిందులు తొక్కుతుంటే చెదరని ఓ చిన్న చిరునవ్వుతో వారి ని అదుపులో పెట్టి, తను చెప్పాల్సింది చెప్పేసి, చేయాల్సింది చేసేసే నాయకుడ్ని మళ్ళీ ఎప్పుడు చూస్తామో . ఏదేమైనా "చిందు కన్నీటి ధారా ప్రేమనే తెలుపులే !" అన్నట్లు శోక సంద్రమైన రాష్ట్రం ఆయన గెలుచుకున్న ప్రేమ ని స్పష్టంగా తెలియచేస్తుంది. తననుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించే తత్వమే "చెప్పకుండా వెళ్తున్నా.." అని చెప్పి మరీ వెళ్ళిపోయేలా చేసిందని బాధ పడడం తప్ప ఎవరైనా ఏమి చేయగలం. ఆ మహా మనిషి కీ ఆయనతో పాటు ఈ దుర్ఘటనలో మరణించిన వారందరి ఆత్మలకూ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్షణం నాయకుడు సినిమా లోని ఈ లైన్లు గుర్తుకొస్తున్నాయ్.

ఓ చుక్క రాలింది !!
ఓ జ్యోతి ఆరింది !!
కన్నీరు మిగిలిందీ !!
కధ ముగిసిందీ !!

ఈ ఫోటోలను ప్రచురించి Hindu వారికీ అవి నా కళ్ళబడేలా చేసిన త్రివిక్రం గారికీ ధన్యవాదాలు.

8 కామెంట్‌లు:

  1. నిజమేనండీ.. ఎన్ని తలచుకున్నా ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి..జ్ఞాపకాలు

    రిప్లయితొలగించండి
  2. He is the greatest CM to rule AP in every possible manner

    ఆంధ్ర ప్రదేష్ చరిత్రలో నిజంగా ప్రజలచేత ఎన్నుకోబడిన ముఖ్య మంత్రి

    రిప్లయితొలగించండి
  3. ఆ మొండి ధైర్యమే, ప్రాణాలు హరించింది. వాతావరణం బాగాలేదని హెచ్చరిస్తున్నా ఏమీ కాదని బయలు దేరడమే ఇంత వరకు తెచ్చింది. అయినా మృత్యువు మరణించబోయే వారి చేత కొన్ని మాటలు అలవోకగా ముందే పలికిస్తుందేమో!

    "చెప్పకుండా వెళుతున్నా"

    "తిరిగి హైదరాబాదు ఎప్పుడొస్తానో తెలీదు"(చిత్తూరు జిల్లాలో వీలైనన్ని ఎక్కువ గ్రామాలు తిరగాలి కాబట్టి)ఇవేనట వై యెస్ చివరి మాటలు.

    చాలా బాధాకరం!

    రిప్లయితొలగించండి
  4. ఆయనకు , ఆయనతోపాటూ చనిపోయిన వారికీ ఆత్మశాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నా !

    రిప్లయితొలగించండి
  5. గీతాచార్య గారు, సుజాత గారు, పరిమళం గారు నెనర్లు.

    రిప్లయితొలగించండి
  6. Your post reminded YSRgaaru again:( A very big loss to AP I can say. ఆ తర్వాత రాష్ట్రమంతా ఎంత గందరగోళం అయ్యిందో తెలుస్తూనే ఉంది

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.