బుధవారం, నవంబర్ 26, 2008

చలి -- పులి

శీర్షిక చూసిన వెంటనే తెలుగు పేపర్ చదివే అలవాటున్న వారికి వాతావరణం ఉష్ణోగ్రతలు కాలమ్ గుర్తుకు వచ్చి ఉంటుంది కదా. పేపర్ వాళ్ళు ఈ Temperatures column heading ని ఆయా కాలాలకి (Seasonal) అణుగుణం గా భలే మారుస్తుంటారు. చలికాలం చలి పులి అని పెట్టి పక్కనే వణుకుతున్న కిరణాలతో సూరీడి బొమ్మ వేస్తారు :-) అలానే ఇక సమ్మర్ లో ఎండాకాలం.. మండే ఎండలు.. ఈ తరహా శీర్షిక లు మామూలే... సరే ఇదంతా ఎందుకు గుర్తు చేసుకుంటున్నా అంటే ఇక్కడ చలి కాలం మొదలై పోయింది అంటే ఇది ఇంకా మొదలే అనుకోండి ఇంకా ముందుంది అసలైన తధిగిణతోం కానీ నిన్న మొన్నటి వరకు సమ్మర్ మరియూ స్ప్రింగ్ వాతావరణం తో ఆనందించిన మనసు ఒక్క సారిగా ఇలా చలి మొదలవగానే కాస్త బాధ తో మూలుగుతుంది.

రేపు ఉదయం నే ఆఫీసుకి వెళ్ళే సమయానికి అంటే 6-7 మధ్యలో ఉష్ణోగ్రతలు 23F & 17F అంటే -5సెంటీగ్రేడ్ & -8సెంటీగ్రేడ్. అన్నట్లు ఈ రెండు అంకెలేంటో తెలుసా... నాకు మొదట్లో పెద్దగా అర్ధం అయ్యేది కాదు ఏమిటా అని చికాగో వచ్చాక బాగా తెలిసొచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే ఇక్కడ ఉష్ణోగ్రత -5C ఉంటే విండ్‌చిల్ వల్ల అది -8C ఉన్నట్లుగా అనిపిస్తుంది. చికాగోని ఆనుకుని ఉన్న ఫ్రెష్ వాటర్ లేక్ (Lake Michigan) వల్ల ఈ ప్రాంతం లో గాలులు ఎక్కువ అవి చలికి తోడై మనల్ని మరింత హింసకి గురిచేస్తాయనమాట. ఇక చూస్కోండి ఈ చలి భారీ నుండి తప్పించుకోవాలంటే ఒక్కొక్కరూ ఢాకూ మంగళ్ సింగ్ లాగా కళ్ళు తప్ప ఏమీ కనిపించ కుండా నిండా కప్పేసుకుంటే కానీ తిరగలేం. పోనీ లే అలా బానే ఉంటుంది కదా అనుకుంటే బయట చలిలో ఉన్నంత సేపూ బాగానే ఉంటుంది వెచ్చగా హాయి గా కానీ ఇంటిలోకో ట్రైన్ లోకో వెళ్ళగానే అక్కడ climate controlled కదా దాంతో ఊపిరి ఆడనట్లు చిరాకు గా అనిపిస్తుంది సో ఎక్కిన వెంటనే గెటప్ చేంజ్ మళ్ళీ దిగే ముందు షరా మాములే ఇలా నాకైతే చాలా చిరాకు గా ఉంటుంది. నాకు కస్త చలి వాతావరణం అంటేనే ఇష్టం కానీ ఇక్కడ చలి తట్టుకోడం నాకు కూడా కష్టమే.

ఒకప్పుడు
చలికాలం ఉదయం తలుపులు బిడాయించేసి అమ్మ చేతి ఫిల్టర్ కాఫీ తాగుతూ పేపర్ లో చలిపులి కాలం లో 20 లలో ఉన్న ఉష్ణోగ్రతలని చూసి బాబోయ్ ఈ రోజు చలి చాల ఎక్కువ ఉంది పదిగంటల వరకు బయటకు వెళ్ళకూడదు అని అనుకోడం గుర్తొస్తే ఉసూరుమనిపిస్తుంది. అసలు నేను ఇండియా లో చలికాలం చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. చలికాలం అంటే ముందు గుర్తొచ్చేవి సంక్రాంతి ముగ్గులు. మా పిన్ని ఉదయం పని కి అడ్డం వస్తుంది పైగా ఆలశ్యం అవుతుంది అని ముందు రోజు రాత్రే 9 దాటాక ముగ్గు వేసేది.

ఆ చలి లో పిన్ని తో కలిసి ముగ్గు లో చుక్కలు లెక్క పెట్టడమూ, ముందే గీసి పెట్టుకున్న ముగ్గుల పుస్తకం లో ముగ్గుని పట్టుకుని చూపించడమూ నాకు చాలా ఇష్టమైన పనులు. అసలు హడావిడి సాయంత్రం స్కూల్ నుండి రాగానే మొదలయ్యేది. ఈ రోజు ఏ ముగ్గు అని పిన్ని నోట్స్ లో ప్రాక్టీస్ చేస్తుంటే పక్కన ఉండి చూసేవాడ్ని లేదంటే ఒకో రోజు పుస్తకం లో ఉన్న వాటిలో నుండి నన్ను సెలెక్ట్ చేయమనేది ఈ రోజు ఏ ముగ్గు వేద్దాం సిరీ అని. ఇక ముగ్గు వేసేప్పుడు అమ్మేమో వరండా లోనుండి "ఒరే స్వెట్టర్ వేసుకు వెళ్ళరా బయటకి" అని చెప్తుంటే "అబ్బా బాగానె ఉందిలేమ్మా అంత చలి లేదు" అని అలానే చలి లో కాస్త వణుకుతూ అయినా నిలబడేవాడ్ని కానీ స్వెట్టర్ వేసుకోడం ఇష్టం ఉండేది కాదు.



ఇక ముందు రోజే ముగ్గు వేసినా పూలూ పెసలు మాత్రం ఉదయాన్నే చల్లే వాళ్ళం. చలికాలం అదో మరువలేని దృశ్యం ఉదయాన్న కురిసే పొగమంచు, దానిని కరిగిస్తూ నులివెచ్చని సూర్యకిరణాలు నేపధ్యం లో పక్షుల కువకువలు ఆ దృశ్యం చూడటానికి రెండు కళ్ళూ చాలవు, అలా తెల్లవారు ఝామునుండీ కురిసిన చిరు మంచులో తడిసిన ముద్దబంతి పూలు కారబ్బంతి పూలు ఎంత అందం గా ఉండేవనీ ఓక్కో రేణువూ కలిపి అందం గా అమర్చినట్లు చిన్ని చిన్ని మంచు బిందువులు పూల రెక్కల మీద ఎవరు నన్ను తాకుతారా ఎప్పుడు జారిపోదామా అన్నట్లు ఉండేవి. ఇంకా చిలక ముక్కు పూలైతే ఎర్రని పూవులపై మంచు బిందువులు, ఆ మంచు బింధువుల నుండి చూస్తే పూవుల ఎరుపు మరింత ఎర్రగా స్వచ్చం గా మెరిసి పోతూ ఎంత అందం గా ఉండేవో చెప్పడానికి మాటలు రావు, ఇప్పటికీ అప్పుడప్పుడూ అలా చల్లని మంచులో తడిచిన పూల స్పర్శ నా చేతులకి తగులుతున్న అనుభూతి కి లోనవుతుంటాను. అంత బావుండేది చలి కాలం.

సరే అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే మరికాస్త చలి నేను B.Tech చదువుకునేప్పుడు ఇండస్ట్రియల్ టూర్ లో భాగం గా వెళ్ళిన ఊటీ, సిమ్లా లలో చూసాను. ఊటీ చలి చక్కలిగింతలు పెడితే సిమ్లా చలి బాగానే వణికించిందని చెప్పచ్చు. నేను మొదటి సారి స్నో ని సిమ్లా లోనే చూసాను. రూం లో హీటర్స్ వేసుకుని పడుకోడం తెల్ల వారు ఝామున అప్పుడే కురిసిన
స్నో తో ఆడుకోడం ఒక అనుభవం అయితే అంత చలి లో షాల్స్, స్వెట్టర్స్ ని ఆశ్రయించి రోడ్డు పక్కన ఉన్న దుకాణం లో అసలు సిసలైన సిమ్లా చాయ్ ఆస్వాదించడం మరో మరువలేని అనుభూతి. సిమ్లాకి చేరుకోవాలంటే కొండల్లోనుండి వెళ్ళే నేరో గేజి రైలు ప్రయాణం కూడా చాలా బాగుంటుందండోయ్.

ఆ తర్వాత మళ్ళీ అమెరికా వచ్చాక అట్లాంటాలొ ఉన్నంత కాలం వింటర్ ఆనందం గానే ఉండేది ఏదో డిశంబర్ ఆఖరునో జనవరిలోనో ఒకటి రెండు సార్లు స్నో పడేది అంతే కానీ చికాగో వచ్చాక ఇదే జీవితం అయిపోయింది. సమ్మర్ ఉండేది నాలుగు నెలలైనా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడటం తోనే మిగిలిన సంవత్సరమంతా భారం గా గడుస్తుంది :-(


13 కామెంట్‌లు:

  1. వేణూ గారూ,

    ఇక్కడి చలి గురించి చెపుతూ పనిలో పని (నా) ఇండియా సంక్రాంతి చలిని గుర్తు చేసారు, బాగుంది.

    ఇక పోతే ఇక్కడి ఈ చలి గురించి ఎంత చెప్పినా తక్కువే, ముఖ్యం గా చికాగో చలి గురించి. అయ్య బాబోయ్ నాకు బాగా అనుభవమే..ఆ పక్కనే ఉన్న విస్కాన్సిన్ లో ఉండి ఒకసారి మా ఫ్రెండ్ ని కలవటానికి చికాగో వెలితే "విండ్ చిల్" అంటే ఏమిటో తెలిసొచ్చింది. అఫ్కోర్స్, విస్కాన్సిన్ చలి కూడా దారుణం.

    తిట్టుకున్నా చలి కూడా నాకు మంచే చేస్తోంది. ఈ మధ్య పొద్దున కాఫీ ఇంట్లో తాగట్లేదు.. ఒక పది నిముషాలు ముందే ఆఫీసు కి బయలుదేరి, డంకిండోనట్స్ డ్రైవ్ త్రూ లో కాఫీ తీసుకొని , పార్కింగ్ లాట్లో ఆపి ఆ చలిలో ,కార్లో కాఫి తాగుతుంటే .. ఆ అనుభవం నాకెంతో బాగుంటుంది. అసలు నేను బెడ్ మీంచి లేచేదే దానికొసం..

    ఈ సీజను అయిపోయేలోపు, బాగా చలేసినప్పుడు నేను కూడా రాసెయ్యాలి ఈ చలి మీద ..


    ఒక అసంబద్దమయిన ప్రశ్న: నేనెక్కడా స్టార్ బక్స్ కి డ్రైవ్ త్రూ ఉండగా చూడలేదు, నాకు తారసపడలేదా లేక స్టార్ బక్స్ దానికి వ్యతిరేకమా?

    రిప్లయితొలగించండి
  2. సంక్రాంతి ముగ్గులు, పొగ మంచు, బంతి పూలు---వెచ్చటి జ్ఞాపకాల్ని కదిలించారుగా.
    చిలక ముక్కు పూలు---ఎంత సుకుమారంగా ఉంటాయో. మేమూ వాటిని చూసి యుగాలయినట్లుంది.

    రిప్లయితొలగించండి
  3. ఉమాశంకర్ గారు నెనర్లు... ఓ ఇంకా బోలెడు టైముంది లెండి విస్కాన్సిన్ కూడా ఏమీ తక్కువతినలేదు జనవరి లో 0F కి పడిపోతుంది అప్పుడు ఓ టపా రాసేయండి.

    బహుశా Dunkin తో పోలిస్తే తక్కువేమో కాని Starbucks కి కూడా డ్రైవ్ త్రూ లు ఉన్నాయండీ. Visit this and select only drive thru option and give your zipcode. Starbucks store locator కానీ ఇక్కడి వాళ్ళు స్టార్‌బక్స్ అంటే ambiance కోసమే వెళ్ళాలంటారు కంట్రీ మ్యూజిక్ ఇంకా పరిసరాలు నేటివిటీని గుర్తుచేస్తాయ్ అని అంటుంటారు, Which is true.

    సిరిసిరిమువ్వ గారు నెనర్లు, అవును నిన్న ఆ విషయం రాయడం మర్చిపోయాను చాలా సుకుమారం గా ఉంటాయ్ ఇంకా గింజలు కూడా భలే ఉంటాయ్ మెత్తగా ముఖ్మల్ లా అనిపించే almost Transparent pouch లో కొంచెం వత్తిడి తగలగానే పగిలిపోతూ భలే గమ్మత్తుగా ఉంటాయ్ Oh god i miss them నేను కూడా వాటిని చూసి చాలా యేళ్ళైంది.

    రిప్లయితొలగించండి
  4. గూడ్ పోస్ట్. ఇప్పుడెందుకో చలివేస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. బాబా గారు మీరు మరీను :-) మహా చతురులు సుమీ :-) Thanks for the comments.

    రిప్లయితొలగించండి
  6. ఇదన్యాయం వేణూ, సంక్రాంతి ముగ్గులు టపా నేను రాద్దామనుకుంటుండగానే మీరు రాసేసారా! ఒక్కసారి వూరెళ్ళిపోవాలనిపించింది.

    మీ దేశంలో మొదటి అడుగు నేను మీ వూర్లోనే పెట్టాను. అదీ అక్టోబర్ చివరాఖర్లో!ఎయిర్ పోర్ట్ లో బాగానే ఉందికదాని మా వారు చెప్తున్నా వినకుండా మామూలు స్వెట్టర్ వేసుకుని బయటికొచ్చేసరికి కళ్ళు తిరిగిపోయి వెంటనే లోపలికి పరిగెత్తాల్సి వచ్చింది. అంత చలిగాలి అప్పుడే చూడ్డం. అప్పటినుంచీ చికాగో అంటే చలి లేకుండా వొణుకొస్తుంది.

    రిప్లయితొలగించండి
  7. వావ్. చలి లో ఇరానీ చాయ్ తాగుతున్నట్టు ఉంది టపా..చేమంతి పూలు చిన్నప్పుడి ఙ్ఞాపకాలు తట్టి లేపాయి.

    రిప్లయితొలగించండి
  8. చికాగో చలికి బాబులా వుంటుంది మా విస్కాన్సిన్ లో.మాకు కూడా అదే లేక్ వుంటుంది.మా వూరు అయితే మూడు వైపులా నీళ్ళు.చలిగాలి.మంచు అయితే భీభత్సం.ఇప్పటికే రెండు సార్లు ఆరారు ఇంచుల మంచు పడిపోయింది.ఈ రోజు రాత్రి నుండి పడుతూనే వుంది.చిత్తడి చిత్తడి గ వుంది.ఎప్పటికప్పుడు వదిలేసి వెళ్ళిపోదామనుకుంటూనే ఇక్కడే వుండిపోతున్నాము :(
    అయితే మీరు చిkaaగో అన్న మాట.ఉమాశంకర్ గారు విస్కాన్సిన్ లో ఎక్కడ వుంటారో?

    రిప్లయితొలగించండి
  9. అదేం లేదు సుజాత గారు ఇప్పటికి చాలా మంది రాసే ఉంటారు అలా అని మనం మానేస్తే ఎలా... మీ శైలి లో మీరు ఓ మంచి అందమైన సంక్రాంతి ముగ్గులాటి టపా రాసేయండి. అన్నట్లు ఏదో పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వచ్చాను కాని దీన్ని నా దేశం చేసేయకండి. నాదేశం ఎప్పటికీ భారతావనే... ఇంకా మాట్లాడితే అసలు సిసలు నరసరావుపేట వాసిని అంటాను.

    రవి thanks for the comment కానీ పోటోలొ ఉన్నవి ముద్దబంతిపూలండీ చామంతులు కాదు.

    రాధిక గారు నెనర్లు, అవును నేను విస్కాన్సిన్ మంచు గురించి వింటూ ఉంటాను. అవునండీ మంచుని చలి నీ ఎంత తిట్టుకున్నా ఇక్కడ ఉండక తప్పదు కదా...అలా గడిపేయడమే...అన్నట్లు నేను చికాగో లో వర్క్ చేస్తాను ఉండేది సౌత్ వెస్టర్న్ సబర్బ్స్ లో నండీ వెస్ట్‌మాంట్ అనే ఊరు లో, లెమాంట్ రామాలయం నుండి 5 మైల్స్ ఉంటుంది మా ఇల్లు.

    రిప్లయితొలగించండి
  10. రాధిక గారూ,

    వేణూ శ్రీకాంత్ గారి బ్లాగు లో కమెంటిన తరువాత మరలా ఇటువైపు రాలేదు అందుకే మీ కమెంటుని మిస్సయ్యాను..

    నేను ఇప్పుడు కనెక్టికట్ లొ ఉన్నానండి. విస్కాన్సిన్లో ఉన్నప్పుడు నేను లక్రోస్ అనే చిన్న ఊళ్ళో ఉండేవాడిని..మినియాపోలిస్ సెయింట్ పాల్ నుంచి ఒక అరగంట ప్రయాణం విమానంలో అయితే..

    రిప్లయితొలగించండి
  11. venu ji ee post chala bagundi..chitanaanni gurthu chesaru..asalu chaduvutonte vallu jhillu mandi,,na gunde jhallumandi..
    :)

    రిప్లయితొలగించండి
  12. venu ji ee post chala bagundi..chitanaanni gurthu chesaru..asalu chaduvutonte vallu jhillu mandi,,na gunde jhallumandi..
    :)

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.